COVID-19 tests in AP: హైదరాబాద్: కరోనావైరస్ (  Coronavirus ) నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ( AP CM YS Jagan review on COVID-19 ) నిర్వహించారు. రానున్న 90 రోజుల్లో ప్రతీ ఇంటికీ సమగ్ర స్క్రీనింగ్‌తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వ తీసుకున్న కీలక నిర్ణయాలివి:
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనావైరస్ నియంత్రణ చర్యలపై ఆయన ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు తదితరులతో సమీక్ష నిర్వహించారు. 104 వాహనాల ద్వారా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రాబోయే 3 నెలల్లో ప్రతీ ఇంటికీ సమగ్ర స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు. 104 వాహనాల్లోనే ప్రతీ ఇంటి నుంచి కోవిడ్-19 శాంపిల్ సేకరణ చేయాలన్నారు. కోవిడ్-19 పరీక్షలతో (  COVID-19 Tests ) పాటు షుగర్, బీపీ లాంటి పరీక్షలు చేస్తూ... అక్కడికక్కడే మందుల పంపిణీ జరగాలని సూచించారు. మెరుగైన వైద్యం అవసరమని భావిస్తే... పీహెచ్‌సీలకు రిఫర్ చేయాలని సూచించారు. ప్రతీ నెలలో ఓ రోజు గ్రామాలకు 104 వాహనం తప్పనిసరిగా వెళ్లాలన్నారు. 


ప్రతీ పీహెచ్‌సీలో కోవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్:
ప్రతీ పీహెచ్‌సీలో కోవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్ (  COVID-19 Sample collection centre ) విధిగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. కరోనా సోకినట్టు నిర్ధారణ అయితే ఏం చేయాలన్నదానిపై ప్రతి గ్రామ సచివాలయంలో హోర్డింగ్ ద్వారా సమాచారం అందించాలన్నారు. త్వరలో అందుబాటులో వచ్చే సబ్ సెంటర్ల ద్వారా గ్రామస్థాయిలో కూడా వైద్య సేవలు ఉంటాయన్నారు. పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకుని అర్బన్ హెల్త్ సెంటర్లు స్థాపించాలని... కోవిడ్-19 నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేయాలని అన్నారు.


ఏపీలోనే అత్యధిక కరోనా పరీక్షలు:


దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఇప్పటికీ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఇవాళ్టి వరకూ రాష్ట్రంలో 6 లక్షల 77 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 24 వేల వరకూ టెస్టులు చేస్తుండగా... ఈ సామర్ధ్యాన్ని 30 వేలకు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో ప్రతీ పది లక్షల మందికి సగటున 12 వేల 675 మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.