బుల్‌బుల్ తుఫాను ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు
బుల్‌బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుండగా అదే సమయంలో తుఫాను ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్: బంగాళాఖాతంలో బుల్‌బుల్ తుఫాను తీవ్రరూపం దాల్చింది. బుల్‌బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుండగా అదే సమయంలో తుఫాను ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రస్తుతం అండమాన్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉండగా తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో తీర ప్రాంతాల్లో గంటకు 100 కిమీ వరకు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలపై బుల్‌బుల్ తుఫాను ప్రభావం విషయానికొస్తే.. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం తర్వాత పశ్చిమ బెంగాల్లో బుల్‌బుల్ తుఫాను తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బుల్‌బుల్ తుఫాను తన దిశ మార్చుకుని ఒడిషా వైపు కదిలే అవకాశాలు కూడా లేకపోలేదని.. అదేకానీ జరిగితే తుఫాన్ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు.