హిందూమహాసముద్రానికి ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శనివారమే తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్‌గా బలపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తుపాన్ కారణంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చెరి తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ తుపాన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించే అవకాశాలు అంతగా లేవని వాతావరణ శాఖ అంచనా వేసినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానున్న మూడు రోజులపాటు శ్రీలంక తీరం వెంబడి వాయువ్య దిశలో కదులుతూ 30వ తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపుగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసినట్టు సమాచారం. పశ్చిమ, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో 30 నుంచి 31 డిగ్రీల వరకు వున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తుపాన్ బలపడేందుకు దోహదం చేస్తాయని.. ఆ తర్వాత తుపాన్‌ మరింత బలపడే క్రమంలో దాని గమనం మందగించే అవకాశాలు ఉన్నాయనేది వాతావరణ శాఖ అధికారుల అంచనా. 


ఈ నెల 30న సాయంత్రానికి ఫణి తుపాన్ దిశ మార్చుకుని ఈశాన్యం వైపు కదులుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ అదే కానీ జరిగితే పంట చేతికొచ్చే సమయంలో తుపాన్ తమని ఇబ్బందులకు గురిచేస్తుందేమోననే ఆందోళనలో వున్న రైతన్నలకు అంతకన్నా ఉపశమనం కలిగించే వార్త మరొకటుండదు.