దూసుకొస్తున్న ఫణి తుపాన్.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం!
దూసుకొస్తున్న ఫణి తుపాన్.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం!
హిందూమహా సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి అలలు ఏడు అడుగుల మేర ఎగసి పడుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ వేగాన్ని పుంజుకుంటున్న ఫణి తుపాన్.. అదే వేగంతో చెన్నై-మచిలీపట్నం వైపుగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో సముద్రం పది అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో తీర ప్రాంతాలన్నీ పోటెత్తిన సంద్రాన్ని తలపిస్తున్నాయి.
తీర ప్రాంతాల్లో ప్రత్యేక మెరైన్ పోలీసులను నియమించి భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. మత్స్య కారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు ముంచుకొస్తున్న ఫణి తుఫాన్ ముప్పు రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏపీలోని ఆర్టీజీఎస్, వాతావరణ శాఖ కేంద్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తూ సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తున్నాయి.