Cyclone Mocha live updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మే 10న మోచా తుఫానుగా మారి, మే 12 నాటికి తీవ్ర తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని, ఈ తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో పాటు గంటకు 130 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 12 తరువాత తీవ్ర తుఫాన్ గా మారిన అనంతరం మోచా తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డా మృత్యుంజయ్ మహాపాత్రో తెలిపారు. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ చెప్పిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోచా తుఫాన్ మన దేశంలో పశ్చిమ బెంగాల్ మినహాయించి మరే ఇతర రాష్ట్రాలపై పెద్ద ప్రభావం చూపించే అవకాశాలు కనిపించం లేదని.. అందుకే ఈ తుఫాన్ కారణంగా ప్రజలు భయాందోళన చెందవద్దని భారత వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఏదేమైనా అండమాన్, నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లరాదని భారత వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఇటీవల కేరళలో పర్యాటక బోటు దుర్ఘటన నేపథ్యంలో పర్యాటక కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండాల్సిందిగా భారత వాతావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. 


ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవులలో గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డా మృత్యుంజయ్ మహాపాత్రో తెలిపారు. 


ఈ తుఫాన్‌కి పేరు మోచా అనే పేరు ఎలా వచ్చిందంటే..
ఈసారి తుఫాన్‌ రావడానికి ముందే తుఫాన్ కి మోచా అనే పేరు పెట్టారు. 500 సంవత్సరాల క్రితమే కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన ఎర్ర సముద్రం పోర్ట్ సిటీ పేరే ఈ మోచా. ఈ తుఫాన్ కి అదే పేరును నామకరణం చేయాల్సిందిగా యెమెన్ ప్రతిపాదించింది.