విశాఖపట్టణం: సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తీరంవెంబడి గాలుల వేగం తీవ్రత అధికమైంది. తీర ప్రాంతాల్లో ఓవైపు సముద్రంలోంచి అలలు ఎగిసిపడుతోంటే.. మరోవైరు భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మొత్తానికి కోస్తాంధ్రను పెథాయ్ తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. నేటి మధ్యాహ్నం తర్వాత కోస్తాంధ్రపై మరో తుఫాను విరుచుకుపడబోతోంది. నిన్నటివరకు గంటకు 15కి.మీ. వేగంతో కదిలిన పెథాయ్ తుఫాను ప్రస్తుతం గంటకు 26కి.మీ. వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు 50-60 కిమీ వేగంతో గాలులు వీస్తుండగా.. పెథాయ్ తీరం దాటే సమయంలో 100 కిమీ వేగంతో మరింత బలమైన గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 
ఆదివారం రాత్రి పెను తుఫాన్ గా మారిన పెథాయ్.. మచిలీపట్నానికి 380, కాకినాడకు 410కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై వుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నందున సోమవారం ఉదయం తర్వాత క్రమేపీ బలహీనపడి, సాయంత్రానికి యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ తుఫాన్ తీరందాటే సమయానికి బలహీనపడనట్టయితే, సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయానికి బలహీనపడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 


పెథాయ్ తుఫాన్ ప్రభావంతో సోమవారం ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు పుదుచ్చేరిలోని యానాం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.