రాష్ట్రాన్ని తక్షణం ఆదుకోండి: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ
రాష్ట్రాన్ని ఆదుకోండి: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తిత్లీ తుఫాను వల్ల రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తిత్లి తుఫాను ధాటికి రూ.2800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్న చంద్రబాబు.. తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు. ఉత్తర కోస్తాలో తిత్లీ తుఫాను ధాటికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే..!
వ్యవసాయ రంగానికి రూ.800 కోట్లు, విద్యుత్‌కు రూ.500 కోట్లు, రోడ్లు రూ.100 కోట్లు, పంచాయతీరాజ్ రూ.100 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.వెయ్యి కోట్లు, పశుసంవర్ధక శాఖ రూ.50 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.100 కోట్లు, ఇరిగేషన్‌కు రూ.100 కోట్ల మేర నష్టం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తూ తుఫాను బాధితులతో మాట్లాడి.. వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నెల జీతం విరాళం
అటు తిత్లి తుఫానుతో నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి టీడీపీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాలను విరాళంగా ఇవ్వనున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. తుఫాను బాధితులను ఆదుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.
అటు తుఫాను ప్రభావంతో జరిగిన పంట నష్టం గురించి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.