`తిత్లీ` తుఫాను: ఏపీ,ఒడిశాలో ప్రమాద హెచ్చరికలు జారీ
ఒడిశా, ఏపీలకు `తిత్లీ` తుఫాను ముప్పు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి తూర్పు, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘తిత్లీ’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తుఫాను తీరం దాటే సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధమయ్యారు
కోస్తా, ఉత్తరాంధ్రలకు 'తిత్లీ' గండం
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో కోస్తా జిల్లాల అధికారులు.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్రలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్టణం, గంగవరం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అటు ఒడిశాలోనూ 'తిత్లీ' తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్‌పూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఒడిశాలోని గోపాలపూర్, పరదీప్, ధమ్రా ఓడరేవులకు 4వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
కాగా.. తుఫాను ఒడిశాలోని గోపాల్‌పూర్, ఏపీలోని కళింగపట్నం తీరాల మధ్య ఈనెల 11వ తేదీ గురువారం ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.