తెలుగుదేశం పార్టీ అబద్ధపు ప్రచారంతో కాలం గడిపిందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బీజేపీని దోషిగా తేలుస్తామని చెప్పి టీడీపీ చేసింది అచ్చం అబద్దపు ప్రచారంలా తోస్తుందని ఆమె అన్నారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినా.. ఆఖరికి ఎవరు దోషి అనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీతో జత కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది కనీవినీ ఎరుగని విచిత్రమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీకి మద్దతు తెలుపుతామని చెప్పిన ఏ ఇతర పార్టీ కూడా.. ఏపీ సమస్యల గురించి మాట్లాడకపోవడం శోచనీయమని పురందేశ్వరి తెలిపారు. విభజనకు అనుకూలమని చెబుతూ లేఖ ఇచ్చింది సాక్షాత్తు చంద్రబాబేనని.. అలాంటప్పుడు ఆయన మళ్లీ బీజేపీని ఏ విధంగా తప్పు పడతారని చెప్పారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఆలోచించడం మాని.. ప్రజల సమస్యలను గురించి పట్టించుకోవాలని అన్నారు. ఎన్నికలలో గెలవడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. 


ఏపీ అభివృద్ధిలో కేంద్రం నుంచి అందిన సహకారాలు మరిచిపోకూడదని పురందేశ్వరి అన్నారు. విభజన చట్టం ప్రకారం అందించిన హామీలు సమాయనుకూలంగా ఒక్కొక్కటీ నెరవేరుతున్నాయని.. అయినా రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం అసత్య ప్రచారం కాక మరేమిటని పురందేశ్వరి ప్రశ్నించారు. 2019లో మళ్లీ కచ్చితంగా గెలిచేది బీజేపీ ప్రభుత్వమేనని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్ భావాలకు వ్యతిరేకంగా వెళ్లి.. ఆ పార్టీతో నేడు చంద్రబాబు చేతులు కలిపారంటే.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం లాంటిదేనని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.