హైదరాబాద్: దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన కుమారుడు హితేష్‌తో కలిసి జగన్ నివాసానికి చేరుకున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సాదర స్వాగతం పలికారు. త్వరలోనే దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైఎస్సార్సీపీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ స్వయంగా ఆయనే వచ్చి వైఎస్ జగన్‌తో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 


ఇదిలావుంటే, తనయుడు హితేష్‌తో కలిసి జగన్‌ని కలవడం వెనుక ఆంతర్యం ఆయన తన తనయుడికి వైఎస్సార్సీపీ టికెట్ ఇప్పించడానికే అయ్యుంటుందా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం జగన్ నివాసం బయట వున్న మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. జనం కోసం జగన్ చేస్తోన్న విస్తృత పర్యటనలను కొనియాడారు. జగన్ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేసిన వెంకటేశ్వర రావు.. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలోనే నియోజకవర్గంలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలతో కలిసి చర్చించిన అనంతరం వైఎస్సార్సీపీలో ఎప్పుడు చేరతామనే అంశంపై స్పష్టత ఇస్తామని దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాకు వెల్లడించారు.