అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన దిశా చట్టానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి చట్టం రూపొందించినందుకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. అత్యాచార ఘటనల్లో సత్వర విచారణ, శిక్షల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టం అభినందనీయమని కొనియాడాయి. తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ ప్రభుత్వం కూడా చేరింది. ఏపీ దిశా చట్టాన్ని అభినందిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ సర్కార్ ఓ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా నిర్భయ, దిశ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమైన వేళ కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం తరఫున కూడా దిశా లాంటి చట్టాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం తమకు వివరాలు ఇవ్వాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏపీ సర్కార్‌ని లేఖ ద్వారా కోరారు. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి వచ్చిన ఈ లేఖను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం... సభలో చదివి వినిపించారు. దిశ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులను అభినందించారు. ప్రభుత్వాన్ని సైతం స్పీకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.