న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేడు కలవనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు ఏపీ భవన్‌లో వీరి భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై విపక్షాలకు వివరించి, అవిశ్వాస తీర్మానానికి వారి మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హస్తిన పర్యటనలో భాగంగా మంగళవారం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలిసి ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వివరించారు.  విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను నేతలకు అందజేశారు. తమ పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని వారికి విజ్ఞప్తిచేశారు. బాబు విజ్ఞప్తికి ఆయా పార్టీల నేతలు సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు పార్లమెంటుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత గాంధీ విగ్రహానికి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు తమ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌కు వెళ్లి వివిధ పార్టీల ఎంపీలను కలుసుకున్నారు.


ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, టిఎంసి ప్లోర్‌ లీడర్‌ సుదీప్‌ బంధోపాధ్యాయ, సౌగత్‌ రాయ్‌, డెరిక్‌ ఒబ్రెయిన్‌, శివసేన నేత ఆనందరావు అడు సుల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలె, తారిక్‌ అన్వర్‌, టిఆర్‌ఎస్‌ ప్లోర్‌ లీడర్‌ జితేందర్‌రెడ్డి, వీరప్ప మెయిలీ (కాంగ్రెస్), రాజీవ్ సతావ్ (కాంగ్రెస్), అనుప్రియ పటేల్ (అప్నా దళ్), హర్సిమ్రత్ కౌర్ బాదల్ (శిరోమణి అకాలీదళ్) తదితరులను సెంట్రల్‌ హాల్‌‌లో కలిసి కాసేపు చర్చించారు.


ఆయా పక్షాల నేతలతో సమావేశం అనంతరం జాతీయ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ముచ్చటించారు. హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా  పట్టించుకోవడంలేదని.. ఇతర పార్టీ నేతలతో కలిసి టీడీపీని దెబ్బతీయాలని చూస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి, పోలవరానికి అరకొర నిధులు ఇస్తున్నారని తెలిపారు. ఏపీకి నిధులు ఇవ్వాలని కోరితే  ఏవేవో కుంటిసాకులు చెబుతున్నారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖలో అన్నీ అబద్దాలే ఉన్నాయని చెప్పారు. సెంట్రల్‌ హాల్‌లో సమావేశాల అనంతరం పార్లమెంటులోని ఎన్టిఆర్‌ విగ్రహానికి నివాళుర్పించారు.


పార్లమెంటు సమావేశాలు అనంతరం సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలతో సుమారు మూడు గంటలపాటు చర్చించారు. కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు నేటి మీడియా సమావేశంలో ఏపీకి జరిగిన అన్యాయంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తదితర అంశాలపై సీఎంతో చర్చించినట్లు  సమావేశం అనంతరం ఎంపీలు సీఎం రమేష్‌, అవంతి శ్రీనివాస్‌, మురళీమోహన్‌ తెలిపారు.