Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బాధ్యతలు  సంతోషం కలిగిస్తున్నాయని.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి అని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నానని.. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న తాను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ఉన్నానని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే తలపెట్టానని.. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపినట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతీ ప్రాంత సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడిందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Heavy rainfall: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ... వచ్చే ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు..
 
"విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాలవాసులు తాగు నీటి కోసం ఎన్ని ప్రయాసలుపడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి - దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో  వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను.


గతేడాది గ్రామ సర్పంచులతో జనసేన కేంద్ర కార్యాలయంలో చర్చాగోష్టి నిర్వహించాము. పార్టీలకు అతీతంగా వందలమంది సర్పంచులు పాల్గొన్నారు.  నాటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించేసిందీ వివరిస్తూ తాము నిధులు, అధికారాలు లేక ఏ విధంగా చేష్టలుడిగిపోయి ఉన్నామో చెప్పారు. స్థానిక సంస్థల చట్టాలు, విధులు, నిధుల వినియోగంపై సాధికారత కలిగిన శ్రీ చెల్లప్ప గారు, డా.ఈడిగ వెంకటేష్ గారు లాంటి మేధావులు, ఆచార్యులతో కూడా ఆ రోజు చర్చించాము. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాను.


పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగం 


‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరం. విశాఖ ఎల్.జి. పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేము. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్ళడానికి చేయూతనిస్తాము. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తాము. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాము.


అటవీ సంపదను కాపాడుకుందాము


వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అటువంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతాము. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాము. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత అవశ్యం.


ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి


అదే విధంగా జనసేన పార్టీ నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించబోయే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు ప్రజా ప్రయోజనం కలిగిన, అభివృద్ధి సంబంధిత శాఖలు అప్పగించారు. పౌరసరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు  కేటాయించడం సంతోషంగా ఉంది. నాదెండ్ల మనోహర్ నిర్వర్తించే ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాము. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాము. రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెడతాము. అదే విధంగా రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తాము. రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పోకడలు, రైతుల వేదనలు స్వయంగా చూశాను. ఆ పరిస్థితులు రానీయము.


పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు


రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి. ఆహ్లాదకర పర్యాటకంతోపాటు, ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధిపై దృష్టి పెడతాము. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తాము. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తాము. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుగావడానికి ఎనలేని సహకారం అందించిన ప్రధానమంత్రి  నరేంద్ర మోడీకి, ప్రజలతో  నేరుగా సంబంధ భాందవ్యాలు కలిగిన మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనసేన పార్టీకి కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజా సేవలు అందిస్తాము. నేను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేని కృషి చేస్తానని అయిదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసులకు సవినయంగా తెలియచేస్తున్నాను." అని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.


Also Read: మొత్తం పైన మెగా-అల్లు ఫ్యామిలీ గొడవ గురించి క్లారిటీ.. ఇక ఇద్దరికీ తెగినట్టే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి