విభజన హామీలపై స్పల్పకాలిక చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ ఇచ్చిన నోటీసులపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఆర్డర్ ప్రకారం దీనిపై ఈ రోజు చర్చ చేపడట్టం కుదరదని.. రేపు చర్చిద్దామంటూ చర్చను రేపటికి వాయిదా వేశారు.  ఛైర్మన్‌ నిర్ణయాన్ని అంగీకరించని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ టీడీపీ నోటీసుపై తక్షణమే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. దీనికి మిగిలిన టీడీపీ సభ్యులు మద్దతుగా నిలిచి నినాదాలు చేశారు. ఛైర్మన్ వారించినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు. ఈ అంశంపై వెంక్యయనాయుడు స్పందిస్తూ సభ్యుల అభ్యర్థన మేరకు విభజన హామీలపై చర్చను రేపటికి వాయిదా వేశామని తెలిపారు.


విభజన హామీలపై టీడీపీ లోక్ సభలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై చర్చ చేపట్టి.. ఓటింగ్ నిర్వహించడం ..అది కాస్తా వీగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెద్దల సభ లోనూ విభజన హామీలపై కేంద్ర వైఖరిని ఎండగట్టాలనే ఉద్దేశంతో టీడీపీ... స్వల్పకాలిక చర్చకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ పరిణామాలపై ఉత్కంఠత నెలకొంది. విభజన హామీలపై కేంద్రం తీరును ఏ మేరకు ఎండగతాయనే దానిపై ఉత్కంఠత నెలకొంది. కాగా ఈ సారి వైసీపీ కూడా టీడీపీతో కలిసి రావడం గమనార్హం.