తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Earthquake in Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగుల తీశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. శనివారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో వస్తువులు కదలడం, కింద పడటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో, ఖమ్మం జిల్లా చింతకాని మండలం, తిమ్మనేనిపాలెం, పాతర్లపాడు, బస్వాపురం, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో, గుంటూరుకు సంబంధించి జగ్గయ్య పేట బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో అర్ధరాత్రి స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత పెరుగుతుందేమోనని రాత్రంతా నిద్రలేకుండా గడిపారు.