అమరావతి: చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక దాడుల వ్యవహారంలో పెండింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకుగాను రాష్ట్రంలో 8 ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. చిన్నారులపై లైంగిక దాడుల కేసులను ఈ ప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. 


బాలలపై లైంగిక వేధింఫుల నివారణే లక్ష్యంగా రూపొందిన పోక్సో(పీఓసిఎస్ఓ యాక్ట్) చట్టం కింద నమోదైన కేసులను త్వ‌రిత‌గ‌తిన విచారణ పూర్తి చేసే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక కోర్టులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్‌లో ఉంటాయో.. ఆయా జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలనే సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకే ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.