B.Tech Students Dance Viral Video: కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. కాలేజీ తరగతి గదిలో ఓ అరవ సినిమా పాటపై 8 మంది విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి అశ్లీలకరమైన భంగిమలతో అసభ్యకరమైన నృత్యం చేసిన వీడియో బయటికి లీకైంది. లీకైన వీడియో కాస్తా కాలేజ్ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులతో పాటు లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థులు అశ్లీల భంగిమలతో చేసిన డాన్స్ వీడియో వాట్సాప్ గ్రూపులతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లోనూ అవడంతో విద్యార్థుల తీరుపై మండిపడిన కాలేజీ యాజమాన్యం... వారిని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. కాలేజీ పరువు -  ప్రతిష్టలకు భంగం కలిగించేలా విద్యార్థులు వ్యవహరించారని కాలేజీ యాజమాన్యం విద్యార్థుల సస్పెన్షన్ ఆర్డర్స్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.


అయితే, ఈ వీడియో స్థానికంగా వైరల్ అవడంతో పాటు ఆ తరువాత విద్యార్థులను సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సైతం వార్తల్లోకెక్కింది. విద్యార్థులను సస్పెండ్ చేస్తూ కాలేజీ తీసుకున్న నిర్ణయంపై సస్పెన్షన్ కి గురైన పలువురు విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. సస్పెన్షన్ కి గురైన విద్యార్థులు ఇంట్లో అయిన వారికి తాము చేసిన తప్పు చెప్పుకోలేక రోజూ కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్నారని, చేసిన తప్పుపై వారు మానసిక క్షోభకు గురవుతున్నారని ఒక విద్యార్థి తల్లి వాయిస్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో విద్యార్థుల అసభ్యకరమైన నృత్యంతో పాటు వారి సస్పెన్షన్ వార్త చర్చనియాంశంగా మారింది.  


గతంలో కాలేజీ యాజమాన్యాలు తీసుకున్న ఇలాంటి నిర్ణయానికి మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి తిరిగి సమాజంలో తలెత్తుకుని తిరగలేక గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము తీసుకున్న నిర్ణయంలో తప్పులేదని.. కాలేజీ తరగతి గదిలో అసభ్యకర భంగిమలతో డాన్స్ చేస్తే తీవ్రంగా స్పందించకుండా ఎలా ఉంటారని కాలేజి యాజమాన్యం ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘటన కాలేజీ ఆవరణలో కాకుండా బయట జరిగితే తాము పట్టించుకునే వాళ్ళం కాదని, కానీ కాలేజీ తరగతి గదిలో ఇలా చేయడం వల్లే వారిని ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేయక తప్పలేదని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు వివరణ ఇస్తున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తానికి ఉన్నత చదువుల కోసమని కాలేజీకి వెళ్లిన విద్యార్థులు.. తరగతి గదిలోనే సభ్య సమాజం తలదించుకునేలా అశ్లీల, అసభ్యకరమైన పోకడలకు పోవడం అన్నివిధాల చర్చనియాంశమైంది.