ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డి శనివారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తిలో రామ్ కుమార్‌కి కండువా కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామ్ కుమార్‌ రెడ్డికి వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ లేదా విశాఖపట్నం ఎంపీ టికెట్‌‌ను జగన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొన్నటి వరకూ బీజేపీ తరఫున ప్రచారం చేసిన రామ్ కుమార్, ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ అంశం రాజకీయ వర్గాల్లో బాగా చర్చనీయాంశమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వెంకటగిరికి సంబంధించి ఆనం రామనారాయణరెడ్డి కూడా పోటీలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా తేలాల్సి ఉంది. రామ్ కుమార్ తండ్రి జనార్థనరెడ్డి కూడా తన చివరి ఎన్నికలలో విశాఖపట్నం నుండే పోటీ చేసి లక్ష 75 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామ్ కుమార్ తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా 2004లో శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందడం గమనార్హం.


1991లో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలకు నైతిక బాధ్యత వహిస్తూ మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఆ పదవిలో ఆయన రెండు సంవత్సరాలు ఉన్నారు. 2014లో కాలేయ వాధ్యితో బాధపడుతూ నిమ్స్‌లో జనార్థనరెడ్డి మరణించారు. అలాగే 2007లో నక్సల్స్ దాడి నుంచి తృటిలో జనార్థనరెడ్డి తప్పించుకున్నారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. జనార్థనరెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.