YS Jagan Disha Police: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, నేరాలు పెరిగిపోతుండడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని.. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును నిలదీశారు. ఇదేమీ రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila: రూ.99కే క్వార్టర్‌ సీసా ఇస్తే అత్యాచారాలు జరుగుతాయి? మద్యంపై వైఎస్‌ షర్మిల ఆందోళన


బద్వేలులో కళాశాల విద్యార్థిని అత్యాచారం చేసి పెట్రోల్‌ పోసి హత్య చేసిన సంఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని.. తమ పాలనలో మహిళలపై దాడులను ఎలా అణచివేశామో వివరించారు. ఈ క్రమంలోనే తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించిన దిశ యాప్‌ విషయమై ప్రస్తావించారు.

Also Read: YS Jagan Mohan Reddy: 30 శాతం ఇస్తావా.. 40 శాతం ఇస్తావా.. లిక్కర్ పాలసీపై మాజీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


'శాంతి భద్రతలను సీఎం చంద్రబాబు కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?' అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ ప్రశ్నించారు. రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలులో కళాశాల విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన వెనుక చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందని విమర్శించారు. తఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు.


'వైఎస్సార్‌సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలు, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం మీద, ప్రజల మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా?' అని నిలదీశారు. తమ ప్రభుత్వంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని నీరుగార్చడం సరికాదన్నారు. 'దిశ’ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే లేదా చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదు సార్లు అటూ ఇటూ ఊపితే నిమిషాల్లో ఘటనా స్థలానికి  చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు. 'దిశ’ యాప్‌తో 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందారని వివరించారు. మొత్తం 1.56 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే దానిపై రాజకీయ కక్ష ఎందుకని జగన్‌ ప్రశ్నించారు. 


'దిశ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబులు, ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలు, 18 'దిశ’ పోలీస్‌స్టేషన్లు, 18 క్రైమ్‌ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరించారు. దిశా కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. వాటిని ఎత్తేసి ఇప్పుడు ఇసుక, మద్యం వంటి కుంభకోణాలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ మద్దతుగా నిలుస్తూ మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ మాజీ సీఎం జగన్‌ మరోసారి ప్రశ్నించారు.




 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter