రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖను పంపించినట్టు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన రేపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నందునే పసుపులేటి బాలరాజు ఆ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం.


విశాఖపట్నం జిల్లాకు చెందిన పసుపులేటి బాలరాజు వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న హయాంలో గిరిజన శాఖ మంత్రిగా సేవలు అందించారు. గతంలో 1989లో విశాఖ జిల్లా చింతపల్లె, 2009లో పాడేరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలుపొందిన ఆయన ఈసారి జనసేన పార్టీ తరపున పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.