విజయవాడ : రేపు ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరైనా దొంగ ఓటు వేస్తే, వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓటు హక్కు కలిగి వున్న వాళ్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరిన ద్వివేది ఎవరైనా దొంగ ఓటు వేసినట్టు తేలితే, వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీచేశారు. 


ఎన్నికల్లో పోటీచేస్తోన్న అభ్యర్థులు మినహా రాజకీయ పార్టీలకు చెందిన స్థానికేతరులు ఎవ్వరూ నియోజక వర్గాల్లో ఉండకూడదని ద్వివేది తేల్చిచెప్పారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీ బృందాలు తనిఖీలు చేస్తాయని, ఆ సమయంలో తనిఖీ బృందానికి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించి సహకరించాల్సిందిగా గోపాలకృష్ణ ద్వివేది ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.