ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరగనున్న ఎన్నికల్లో పోటీపడేందుకు ఓ కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోందా ? ప్రస్తుతం అధికారంలో వున్న టీడీపీ, ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీ, మిత్ర పక్షమైన టీడీపీ దూరం జరగడంతో ఒంటరిగానే బరిలోకి దిగడానికి సిద్ధపడిన బీజేపీ, పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ, లెఫ్ట్ పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ పడనుండగా వీటికితోడు మరో కొత్త పార్టీ ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధపడుతున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడుతున్న టాక్ ప్రకారం ఆ పార్టీని పెట్టబోయేది ఇంకెవరో కాదు... విధి నిర్వహణలో స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణనే. అవును మహారాష్ట్ర అదనపు డీజీగా విధులు నిర్వహిస్తూ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణ ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నారనేది ఆ టాక్ సారాంశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న అనంతరం అనేకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన బీజేపీలో చేరనున్నారని కొందరు అంటే, కాదు జనసేన పార్టీలో చేరబోతున్నారని ఇంకొన్ని వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. లక్ష్మీనారాయణ రాష్ట్రంలో కాపులను కలుపుకుని ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రాజకీయాల్లో సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో భారీ మొత్తంలో నిధులు అవసరం. అంత పెద్ద మొత్తంలో ఈ ఐపీఎస్ ఆఫీసర్ నిధులు సమకూర్చుకోగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


అన్నింటికిమించి విధి నిర్వహణలో ఎంతో స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుని యువతకు ఆదర్శంగా నిలిచిన లక్ష్మీనారాయణ ఇలా ఓ కులానికి నాయకత్వం వహించి రాజకీయాల్లో ఎదగాలని భావిస్తారంటే అంత నమ్మశక్యంగా లేదని అనుకునే వాళ్లూ లేకపోలేదు. ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడాలంటే, లక్ష్మీనారాయణ స్వయంగా స్పందించాల్సిందే. అప్పటివరకు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలిసే పరిస్థితి అయితే కనిపించడం లేదు.