సెప్టిక్ ట్యాంకులో పడి నలుగురు మృతి
విశాఖపట్టణం జిల్లాలో మరుగుదొడ్డి గోతిలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
విశాఖపట్టణం జిల్లాలో మరుగుదొడ్డి గోతిలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన కాండ్రకోట అప్పారావు (50), కాండ్రకోట రాజశేఖర్ (28) (తండ్రీ కొడుకులు), కాండ్రకోట కృష్ణ (30), కాండ్రకోట నాగేశ్వరరావు (35)లు మరణించారు. పోలీసుల కథనం మేరకు శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న కాండ్రకోట అప్పారావు ఇంటి వద్ద నిర్మించిన సెప్టిక్ ట్యాంకు నిండిపోయింది. అందులోని వ్యర్ధాన్ని కొత్త ట్యాంకులోకి పంపించేందుకు అప్పారావు ట్యాంకులోకి దిగాడు. ఈ ప్రయత్నంలో అతను ఊపిరాడక కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుమారుడు తండ్రిని కాపాడే యత్నంలో ట్యాంకులోనే కుప్పకూలాడు. కుటుంబ సభ్యుల అరుపులు, కేకలు విన్న అప్పారావు సోదరుల పిల్లలు కాండ్రకోట కృష్ణ, కాండ్రకోట నాగేశ్వరరావు, సత్తిరాజు వారిని కాపాడేందుకు ట్యాంకులో దిగగా..వారు గ్యాస్ ప్రభావంతో అక్కడే చిక్కుకపోయారు. స్థానికులు వారిని బయటికి తీయగా.. వీరిలో కొన ఊపిరితో ఉన్న సత్తిబాబును హుటాహుటిన నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయిన నలుగురి మృతదేహాలను పోలీసులు నక్కపల్లి శవాగారానికి తీసుకెళ్లారు.