విజయవాడ: బుద్ధిగా పాఠాలు నేర్చుకునే వయస్సులో పాఠశాలలోనే మద్యం సేవిస్తూ ఇద్దరు బాలికలు ఉపాధ్యాయులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు శనివారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో మద్యం సేవించారు. తాగిన మత్తులో తోటి విద్యార్థులను దూషించడంతో వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మిగతా విద్యార్థులు ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల పరిస్థితి గమనించిన పాఠశాల ప్రాధానోపాధ్యుడు వైద్యులను పిలిపించి పరీక్షలు నిర్వహించగా వారు మద్యం సేవించినట్లు నిర్థారణ అయింది. 


జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రధానోపాధ్యాయుడు వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించడంతోపాటు విద్యార్థినులకు టీసీలు ఇచ్చి పంపించేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధానోపాధ్యాయుడు.. ''ఈ ఇద్దరి విద్యార్థినుల తండ్రి మద్యానికి బానిస కాగా తండ్రి తాగిన తర్వాత మిగిలిన మద్యాన్ని నీళ్లలో కలుపుకొని బాటిల్స్‌లో పాఠశాలకు తీసుకొచ్చి కొద్దికొద్దిగా తాగుతున్నట్లు తమ విచారణలో వెల్లడైంది'' అని అన్నారు. వీళ్లను నిర్లక్ష్యం చేస్తే, పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందనే భయంతోపాటు పాఠశాల విలువలు కాపాడాలనే ఉద్దేశంతోనే వారికి టీసీ ఇచ్చినట్టు ప్రాధానోపాధ్యాడు తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రుల చెడు ప్రవర్తన వారి పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తుందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.