అలర్ట్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన
అలర్ట్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని, భువనేశ్వర్‌కు దగ్గరలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైందని పేర్కొంది. అటు తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కోస్తాలో విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
అటు ఉత్తర కోస్తాల్లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఉప్పోగడంతో.. హొస్పెట్ దగ్గరలోని తుంగభద్ర డ్యాం అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తివేసి, 1.92 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బళ్లారి, రాయచూరు జిల్లాలతో పాటు కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల నదితీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం ఇంజనీర్లు హెచ్చరికలు జారీ చేశారు. సుంకేసుల జలాశయానికి వరద ఉద్ధృతి పెరగడంతో.. అధికారులు 16 గేట్లు ఎత్తివేసి 1.34 లక్షల క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.