పోలవరంపై వైఖరి చెప్పాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ దాఖలు చేసి పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరుఫున వాదనలు విన్న ధర్మాసనం.... పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై నాలుగువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలవరం విషయం మోడీ సర్కార్ తాత్సారం చేస్తున్న నేపథ్యంలో కేవీపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కేవీపీ పిటిషన్‌లో ఏముందంటే ?
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోదని కేవీపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. విభజన చట్టాన్ని అనుసరించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని..ఈ మేరకు ఖర్చుమొత్తం భవించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రంపైనే ఉందని వెల్లడించారు.
రాష్ట్ర ఖజానాపై పెను భారం...
పోలవరం ప్రాజెక్ట్ ఖర్చుపై ఏపీ సర్కార్ చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉందని.. ఈ ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు చెబుతున్న మాటలు రాష్ట్ర ఖజానాపై పెను భారం పెంచేలా తయారవుతున్నాయని కేవీపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించాల్సిందిగా పిటిషన్ లో వెల్లడించారు.