విజయవాడలో సంచలనం నమోదు చేసిన ఆయేషా మీరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆ కేసును మరల విచారణ చేసి.. రిపోర్టు అందజేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. మొదటి నుండి మళ్లీ ఈ విచారణ మొదలు పెట్టాలని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా తెలిపింది. గతంలో ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఇదే కేసులో శిక్ష కూడా అనుభవించారు. కానీ 2016లో సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పును ఇవ్వడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో అసలు హంతకులను పట్టుకోవడానికి మళ్లీ పునర్విచారణ చేయాలని తెలిపింది. ఈ క్రమంలో స్పెషల్  ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు బాధ్యతలను అప్పగించింది. ఆ తర్వాత ఈ టీమ్ దర్యాప్తును సజావుగా చేయడం లేదని పలువురు ఫిర్యాదు చేసిన క్రమంలో ఆ టీమ్‌కు కూడా కోర్టు చీవాట్లు పెట్టింది. డిసెంబరు 27, 2007 తేదిన విజయవాడలోని ఓ లేడీస్ హాస్టలులో ఆయేషా మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. 


ఆయేషా మీరా చనిపోయేనాటికి ఆమె బీఫార్మసీ చదువుతోంది. హాస్టలు బాత్ రూమ్ సమీపంలో రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించడంతో.. విద్యార్థులు వెంటనే పోలీసులకు కబురు అందించారు. ఈ కేసులో డీఎన్ఏ శాంపిల్స్  కూడా తారుమారు చేశారని.. తర్వాత అధికారులపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బంధువుకి కూడా ఈ మర్డర్‌లో భాగముందని వార్తలు వచ్చాయి. విజయవాడ కోర్టులో ఆయేషా మీరా కేసు ఆధారాలను తప్పుదోవ పట్టించారంటూ ఆమె తల్లి హైకోర్టుని ఆశ్రయించడంతో ఆ కేసు మళ్లీ సీబీఐ చేతికొచ్చింది.