ఉత్తరాంధ్రకు ఉరుములు, మెరుపులతో ముప్పు పొంచివున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆకాశంలో విద్యుత్ ప్రకంపనల తరహాలో అలజడి చోటుచేసుకునే ప్రమాదం వున్నందున అక్కడి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని అరకు, ముంచింగ్‌పుట్, డుంబ్రిగూడ, హూంకుపేట్‌తోపాటు విజయనగరం జిల్లా పరిధిలోని సాలూరు, పాచిపెంట, మెంతాడ ప్రాంతాల్లో ఈ ముప్పు అధికంగా పొంచి వున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి. 


ఇదిలావుంటే, గత రెండు మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వాతావరణంలో చోటుచేసుకుంటోన్న భారీ మార్పుల కారణంగా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. పలు చోట్ల పిడుగులు కూడా పడనున్నట్టు ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.