ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా సమన్యాయం ఉంటుందని తెలిపిన ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషనులో ఔట్ సోర్సింగ్‌ పద్ధతిలో జానకి అనే ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాన్ని అందించింది. కడప జిల్లాలోని చెన్నూరులో గుడిలో కుటుంబంతో సహా తలదాచుకొనే జానకి డిగ్రీ వరకూ చదువుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన క్రమంలో వారితో ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. వారు చదువుకొనేందుకు ప్రభుత్వం తనవంతు సహాయం చేస్తుందని తెలిపారు. అలాగే ఇప్పటికే చదువుకున్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను కూడా ఉద్యోగాలకు అప్లై చేయమని తెలిపారు.


అందులో పలు ప్రభుత్వ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ చేస్తున్న సమయంలో.. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను కూడా అప్లై చేయమని ప్రోత్సహించారు. ఆ విధంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషనులో ఉద్యోగానికి అప్లై చేసిన జానకి,  పరీక్ష పాసై  నెలకు రూ.15000 జీతానికి ఉద్యోగాన్ని కూడా పొందడం విశేషం. జానకిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు.