తీవ్రరూపం దాల్చిన ఫొని; ఏపీలో తుపాను ప్రభావం ఎంత ?
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను తీవ్ర రూపం దాల్చింది
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఈ నెల 3న మధ్యాహ్నాం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఒడిషాతో పోల్చితే తుపాను ప్రభావం ఏపీపై తక్కువగానే ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఉత్తరాంధ్రపైనే ఎక్కవ ప్రభావం
ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 80- 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. తుపాను ప్రభావం వల్ల ఈ నెల 2,3 ( రేపు,ఎల్లుండు ) తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.
ప్రభావిత మండలాలు ఇవే..
తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభావిత మండలాలు ఏపీ సర్కార్ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాల్లోని సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, పోలాకి, నందిగాం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాలు. అలాగే విజయనగరం జిల్లాలోని భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ. విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా భీమునిపట్నంలో తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అంచానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో నివాసముండే జనాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు