పార్టీని విడిచి వెళ్లిన నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలి: ఉమెన్ చాందీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా కొత్తగా ఎంపికైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా కొత్తగా ఎంపికైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వెళ్ళిపోయిన 'పాత మిత్రులు' తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఈ బాధ్యత తనకు ఒక సవాల్ అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఏపీ నుంచే దేశానికి నాయకత్వం వహించారని చెప్పారు. ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై నమ్మకం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ, 'వారందరూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన పాత మిత్రులు. వారందరూ పార్టీలోకి తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని విడిచిపెట్టిన నాయకులు, కార్యకర్తలు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను" అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌తో ఉన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ప్రేమను అందించారు. రాజీవ్ గాంధీ తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.వి.కి కాంగ్రెస్ ప్రధాని బాధ్యతలను అప్పగించింది " అని చాందీ గుర్తు చేశారు.
అధినేత రాహుల్ నేతృత్వంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోనికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 11న చాందీ విజయవాడకు చేరుకొని రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.
ఉమెన్ చాందీకి రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే జగన్‌కు చేరువకావడానికి చాందీకి కలిసివచ్చే అంశం. జగన్‌ను మళ్లీ కాంగ్రెస్‌లో తిరిగి తీసుకొచ్చి కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.