ప్రపంచవ్యాప్తంగా జరిగే బుల్ ఫైట్స్‌లో స్పెయిన్ దేశం పెట్టింది పేరు. ప్రతీ ఏడాది స్పెయిన్‌లో జరిగే కోడె యుద్ధాలను చూడడానికి కొన్ని లక్షలమంది హాజరవుతారు. అలాంటి కోడె యుద్ధంలో పాల్గొని.. తొలిసారిగా ఒక తెలుగువాడు గెలిచిన ఘటన ఓ వంద సంవత్సరాల క్రితం జరిగింది. అలా చరిత్రలో నిలిచిపోయిన ఆ తెలుగు వ్యక్తే కోడి రామమూర్తి. కేవలం మల్లయుద్ధంలో మాత్రమే ప్రావీణ్యం ఉన్న కోడి రామమూర్తి ఆ కాలంలో తొలిసారిగా బుల్ ఫైట్‌లో పాల్గొని.. కోడె కొమ్ములను గట్టిగా చేతులతో వంచి.. వాటిని లొంగదీసుకొని.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ విధంగా ఒక సరికొత్త రికార్డు సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికే రామమూర్తికి ఓ సర్కస్ కంపెనీ ఉండేది. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రదర్శనలిచ్చేవారు. అప్పుడప్పుడు స్పెయిన్‌లో చేసిన విధంగా.. ఎవరూ ఊహించని సాహసాలూ చేసేవారు. రామమూర్తి సాహసాలకు మెచ్చి అప్పటి లండన్ రాజదంపతులు మేరి, జార్జిలు ఆయనను తమ రాజభవనానికి ఆహ్వానించారు. అక్కడే రామమూర్తిని "ఇండిన్ హెర్క్యులస్" బిరుదుతో సత్కరించారు. ఆయన ప్రదర్శనలు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, మదన్ మోహన్ మాలవ్య లాంటి వారిని సైతం ఎంతగానో ఆకర్షించాయి. 


అయితే రంగూన్‌లో ప్రదర్శన ఇస్తున్న సమయంలో రామమూర్తిని హత్య చేయాలని కొందరు భావించారు. అయితే ఏమీ చేయలేకపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత రామమూర్తి తన అంతర్జాతీయ ప్రదర్శనలకు స్వస్తి పలికి.. భారతదేశంలోనే యువకులకు వ్యాయామంలో, మల్లయుద్ధంలో శిక్షణ ఇస్తూ గడిపారు. ఎంతో డబ్బు కూడా గడించారు. కానీ దాన ధర్మాలు చేయడం వల్ల ఆస్తి కరిగిపోయింది. కొన్నాళ్ల తర్వాత రాచపుండుతో బాధపడిన రామమూర్తికి వైద్యులు కాలు తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన చివరి రోజుల్లో పాట్నా, కలవాండి (ఒరిస్సా) పరగణాల ప్రభువుల ఇచ్చే ఆర్థిక సహాయంతో కోడి రామమూర్తి గడిపారు. 1942లో కన్నుమూశారు. అయినప్పటీ భారతదేశంలోనే "కలియుగ భీముడి" కితాబునందుకున్న వ్యక్తిగా తెలుగువాడైన కోడి రామమూర్తి నిలవడం విశేషం.