శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ-41 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి గురువారం తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ నింగిలోకి ఎగిరింది.  32 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా నిర్ణయించిన సమయానికి ఈ రాకెట్‌ను కక్ష్య‌లోకి ప్రయోగించారు. సరిగ్గా 19.19 నిముషాల వ్యవధిలో ఈ రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. మొదటి ప్రయోగ వేదిక నుండి జరిగే ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 41 వాహక నౌక ద్వారా నావిగేషన్ సిరీస్‌కు సంబంధించిన భారత క్షేత్రీయ దిక్సూచి తొమ్మిదో ఉపగ్రహాన్ని (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ) మోసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీఎస్ఎల్వీ సీ-41 రాకెట్ విశేషాలు:


* ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది
* ఈ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. ఇందులో రుబీడియం పరమాణు గడియారాలున్నాయి.
* దీని ద్వారా దేశ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
* నేల, నింగితో పాటు, సముద్రంలో ఈ ఉపగ్రహం మార్గనిర్దేశం చేయనుంది. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని, కచ్చితమైన సమయం తెలియజేయడానికి మ్యాపింగ్‌కు ఉపయోగపడనుంది.