రాజీనామాలు ఆమోదించినా ఉపఎన్నికలు రావు!
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై జూన్ 5-7మధ్య లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై జూన్ 5-7మధ్య లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదట. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక జరిగితే గెలిచే సభ్యుడి పదవీకాలం సంవత్సరం ఉండాలట. 2019 జూన్ 4తో మోదీ సర్కార్‌కు ఐదేళ్ళు నిండుతాయి.
జూన్ 5న ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఎన్నికలు జరగాలంటే ఆపై మరో నెల రోజుల సమయమైనా పడుతుంది. అప్పుడు గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండదు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎన్నికల సంఘం ఖాళీ అయ్యే చోట్ల ఎన్నికలు జరిపించేందుకు 90 రోజుల వరకు సమయం తీసుకుంటుంది. దీంతో ఇక ఉపఎన్నికల ఊసే ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా వైసీపీ రాజీనామాల పేరుతో డ్రామాలాడుతోందని మంత్రి యనమల అన్నారు.
మంగళవారం రాజీనామాలపై ఎంపీలు సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశాము గనుక వాటిని తక్షణమే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమాల ప్రభావంతో రాజీనామా చేశారా? అని స్పీకర్ వారిని ప్రశ్నించారని సమాచారం. రాజీనామాలపై పునరాలోచన చేయాలని ఎంపీలను కోరినట్లు తెలిసింది. స్పీకర్‌తో సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన ఎంపీలు రాజీనామాలపై పునరాలోచన చేయమని కోరారని, అయితే తమ వైఖరిలో మార్పు లేదని తెలిపామన్నారు. రాజీనామాలు ఆమోదం ఆలస్యం చేస్తే మళ్లి స్పీకర్‌ను కలుస్తామన్నారు.