న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతిలోని అధికార నివాసానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. నిన్న కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం, నేడు కేంద్ర న్యాయశాఖ, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. పలు ప్రధానమైన అంశాలను రవిశంకర్‌ ప్రసాద్‌ దృష్టికి తీసుకు వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని న్యాయశాఖమంత్రికి వెల్లడించారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ అన్నీ ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సీఎం వివరించారు. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. 


శాసనమండలి రద్దు అంశంతో పాటు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందని, కేంద్ర న్యాయశాఖ చర్యలు తదుపరి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. 


మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి తీసుకు వచ్చేలా న్యాయశాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ను సీఎం కోరారు. చట్టం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..