ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.  ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి .. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యాహ్నం అమరావతి సచివాలయం నుంచి ఏపీ సీఎం జగన్ .. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు.  మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల 10 నిముషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఈ భేటీలో ఇరువురి మధ్య అమరావతి రాజధాని విషయంతోపాటు మూడు రాజధానుల విషయం చర్చకు రానుంది. మండలి రద్దుపైనా ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి వివరించనున్నారు. 


ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుస్తారనే చర్చ జరుగుతోంది. కానీ అపాయింట్ మెంట్ విషయాన్ని మాత్రం సీఎఓ అధికారులు ధృవీకరించడం లేదు. ఐతే ఢిల్లీ పర్యటనను ఈ రోజే ముగించుకుని రాత్రి 7 గంటలకు దేశ రాజధాని నుంచి అమరావతికి తిరుగు పయనం అవుతారని తెలుస్తోంది. రాత్రి  9 గంటల 40 నిముషాలకు మళ్లీ సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 


మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.