2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురం నుంచి ప్రారంభం కానుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురం నుంచి ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురంలో జనపోరాట యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా కవిటి మండలం కపాసుకుద్ది తీరప్రాంతం వద్ద గంగ పూజలు చేశారు. తొలుత పవన్ కల్యాణ్ మత్స్యకారులతో కలిసి సముద్ర స్నానం చేశారు. సముద్రస్నానం తర్వాత పవన్ గంగమ్మ పూజలో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. 'యువత మద్దతు, పెద్దల ఆశీస్సులుంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. మిగితా వారిలా కులాలను విడదీసి పబ్బం గడపను. నేను పదవి కోరుకోలేదు. పని చేయాలని అనుకున్నా. ప్రజాసేవే మా సిద్ధాంతం. ఇది సమస్యల అవగాహన పర్యటన మాత్రమే. ఈసారి సమస్యల పరిష్కారం గురించి చెప్తా' అని అన్నారు. అనంతరం స్వేచ్ఛావతి ఆలయంలో పవన్ పూజలు చేశారు. మధ్యాహ్నం సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.