విజయవాడ: ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు మాత్రమే ఉన్న చిన్న రాష్ట్రమని.. అటువంటి చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకని జనసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీ కందుల దుర్గేష్  ప్రశ్నించారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. రాజధాని వికేంద్రీకరణ కాదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడని రాజధాని వికేంద్రీకరణకు జనసేన పార్టీ ఎప్పటికీ స్వాగతించదని అన్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, స్పీకర్ ప్యానెల్ సభ్యులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ “రాజధాని విషయంలో ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదిక రాకుండానే ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేయడం చూస్తుంటే.. ఆయన మనసులో ఏమనుకుంటున్నారో అదే చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప .. కమిటీ నివేదికతో సంబంధం లేదని తెలుస్తోంది. రాజధాని విషయంలో ఆయనకు ముందుగానే ఓ ఆలోచన ఉంది. దాని ప్రకారమే ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు అని మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన వెనక వైసీపీ ఇన్‌సైడ్ ట్రేడింగ్..
రాజధాని అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆరోపించిన వైఎస్సార్సీపీ నాయకులు కూడా ఇప్పుడు అదే ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారని కందుల దుర్గేష్ ఆరోపించారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నాయకులు విశాఖ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఐదేళ్లుగా అక్కడే మకాం వేసి చాలా రకాలుగా లావాదేవీలు చేస్తున్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం గుర్తించింది. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పింది. 


జీఎన్ రావు కమిటీ నివేదిక రానివ్వండి..
ఇలా మూడు చోట్ల రాజధాని పెట్టడం వల్ల హైకోర్టుకు వెళ్లడానికి శ్రీకాకుళం వాసులకు చాలా కష్టమవుతుంది. అలాగే విశాఖకు రావడానికి కర్నూలు వాసులకు కష్టమవుతుంది. ముందు జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చాక దానిపై చర్చించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప నివేదిక రాక ముందే ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయకండి అని హితవు పలికారు.