ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన మహిళా నాయకురాలు!
ఆంధ్రప్రదేశ్‌లో పురుడు పోసుకున్న మరో కొత్త రాజకీయ పార్టీ
మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. విశాఖ జిల్లాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పేరిట ఈ రాజకీయ పార్టీని స్థాపించారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమె తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా ఆమె ఆవిష్కరించారు. నీలం, తెలుపు రంగుల కలయికతో రూపొందించిన పార్టీ జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత గత కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకానొక దశలో ఆమె టీడీపీలో చేరారనే వార్తలు వెలువడ్డాయి. కానీ అలా కాకుండా ఆమె మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.
అన్నింటికిమించి పార్టీ పేరుని ప్రకటించిన మీడియా సమావేశంలోనే ఆమె వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లరని, ప్రజా సమస్యల్ని ప్రస్తావించడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారని కొత్తపల్లి గీత విమర్శించారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ.. గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన తాను నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉన్న తాను అరకు ఎంపీగా గిరిజన ప్రాంత సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించానని తెలిపారు.
వైఎస్సార్సీపీలోంచి బయటికొచ్చిన కొత్తపల్లి గీత ఓ పార్టీని స్థాపించడమే ఆశ్చర్యంగా ఉందంటే, ఆమె మళ్లీ అదే వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని తొలి ప్రెస్‌మీట్‌లోనే ఆ పార్టీపై విమర్శలు గుప్పించడం ప్రస్తుతం మరింత చర్చనియాంశమైంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టుకొచ్చిన ఈ పార్టీ, అసలు ఎవరిని లక్ష్యంగా చేసుకోనుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.