జనసేన పార్టీ పత్రిక ‘శతఘ్ని’ విడుదల
జనసేన పార్టీ సంకల్పం తెలియచేసేందుకు ‘శతఘ్ని’ పేరిట పక్ష ప్రతికను ప్రారంభించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించిన కరదీపికను పవన్ కల్యాణ్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే పక్ష పత్రిక ఉపయోగపడుతుందన్నారు. పార్టీ సంబంధించిన కార్యక్రమాలు ఇందులో ప్రచురిస్తామని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీలకు అసలు సిద్ధాంతాలే లేవని విమర్శించిన పవన్...తమ పార్టీకి బలమైన సిద్ధాంతాలు ఉన్నాయని సమర్ధించుకున్నారు.జనసేనా సిద్ధాంతాలు తెలియాలంటే కరదీపిక చదవాలని పవన్ సూచించారు. అవినీతి రహిత సమాజం స్థాపనే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని పవన్ వెల్లడించారు.
'వాడవాడ జనసేన జెండా' కార్యక్రమం
ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరుకి 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 'వాడవాడ జనసేన జెండా' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రం, మండల కేంద్రం, గ్రామం, బూత్ స్థాయిలో ‘జనసేన’ జెండా ఎగరాలి’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు.