అనంతపురం బాట పడుతున్న పవన్ కల్యాణ్
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కరువు యాత్ర పేరిట మూడు రోజులపాటు జరగనున్న పర్యటన గుత్తి, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, సోములదొడ్డి హనుమాన్ జంక్షన్ ప్రాంతాల మీదుగా కొనసాగనుందని తెలుస్తోంది. ఇదే పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో కరువుపై అధ్యయనం చేయనున్నారు. మొదట శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసి ఆ తర్వాత స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం స్థానిక కే.టి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే 'సీమ కరువుకు పరిష్కార మార్గాలు' అంశంపై రైతులు, వ్యవసాయ, నీటిపారుదల నిపుణులతో కలిసి చర్చించనున్నారు.
ఆ మరుసటి రోజున కదిరిలో నర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి అక్కడి నుంచి పుట్టపర్తికి చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే సోములదొడ్డి సమీపంలోని హనుమాన్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన మరో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రానికి పుట్టపర్తి చేరుకుని అక్కడి సత్యసాయి మందిరం, మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి ఆ మరుసటి రోజైన 29 నాడు ధర్మవరానికి ప్రయాణమవుతారు.
ధర్మవరంలో స్థానిక చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం హిందూపురం చేరుకుని అక్కడ జనసేన కార్యకర్తలతో భేటీ అవనున్నారు. సాయంత్రానికి హిందూపురం నుంచి కర్ణాటకలోని చిక్బళ్లాపూర్‌కు వెళ్లి అక్కడి సి.వి.వి. ఇనిస్టిట్యూట్‌ను సందర్శించనున్నారు. 29వ తేదీన రాత్రి అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్కడి నుంచి బెంగుళూరు విమానాశ్రయం చేరుకుంటారని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం.