జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆయన్ని అదుపులోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద రావుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై మంగళవారం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. స్టేషన్ బెయిల్‌తో పోయేంత చిన్న ఘటనను పెద్దది చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సబబు కాదు అని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడి, కిడ్నాప్ చేయడానికి యత్నిస్తే ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదు కాని ఒక చిన్న ఘటనలో ఎమ్మెల్యే రాపాకను నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బుక్ చేయడం ఎంతమేరకు సమంజసం అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ఇకనైనా ఈ ఘటనను పెద్దది చేయకుండా వదిలేయాలన్న పవన్ కల్యాణ్... జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం సంయమనం పాటించాలని సూచించారు. ఒకవేళ అంతగా తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే.. తానే స్వయంగా రాజోలు వచ్చి మీకు అండగా నిలుస్తా అని పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.