ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మే 15 నుంచి గ్రామ స్వరాజ్యం పేరుతో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టే అవకాశముందని జనసేన వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రత్యేకించి ఒక వాహనాన్ని కూడా జనసేన సిద్ధం చేసుకుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో.. ఇక ప్రజల్లో ఉండాలని పవన్‌ భావిస్తున్నట్లు సమాచారం. యాత్ర సందర్బంగా రాత్రిపూట గ్రామాల్లోనే బస చేసి, అక్కడి సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండట్టేందుకు సన్నద్దమవుతున్నారని అంటున్నారు.


జనసేన పార్టీ ప్రణాళికకర్త దేవ్‌ దిశ నిర్ధేశకత్వంలో పవన్‌ బస్సు యాత్రకు రూపకల్పన జరుగుతోంది.  ఇందుకు సంబంధించిన విధి విధానాలు, రూట్‌ మ్యాప్‌ను ఈ నెల 11-15 తేదీల మధ్యలో పవన్‌ స్వయంగా ప్రకటిస్తారని అంటున్నారు. తొలి విడతలో ఏడు జిల్లాల పర్యటనకు రూట్‌మ్యాప్‌పై పార్టీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాల్లో ఎక్కువగా గ్రామాల్లోకి వెళ్లేలా రూట్‌మ్యామ్‌ తయారవుతుంది. యాత్ర ద్వారానే క్రియాశీలక కార్యకర్తలను కూడా తయారు చేయనున్నారని అంటున్నారు. నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగ సభలతో పాటు ఆగస్టులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే సీక్రెట్‌గా అభ్యర్ధుల వేటను కూడా పవన్‌ చేస్తారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పవన్ ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తారని చెప్పిన సంగతి తెలిసిందే..!