2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: పవన్ కళ్యాణ్
వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 'రాజకీయాల్లోకి నవతరాన్ని, యువతరాన్ని తీసుకురావాలనేది నా ఆలోచన. రాజకీయంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు లేవు. 2019 సాధారణ ఎన్నికలకు ఒంటరిగానే పోటీలో దిగాలనుకుంటున్నాం. సామాజిక సమతౌల్యం తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశం’ అని పవన్ కళ్యాణ్ వివరించారు. శనివారం విజయవాడలో జనసేన పార్టీ ఆఫీసులో కొంతమంది మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది అని ప్రశ్నించగా.. తన మద్దతుదారుల్లో కొందరు జగన్‌తో వెళ్లాలని, తెదేపాతోనే ఉండాలని అనేవారు ఉన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది తన అభిప్రాయమన్నారు.
మోదీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది తానేనని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు నవతరం, యువతరం మద్దతు ఉందని, వారిని సరైన మార్గంలో నడిపించాల్సి ఉందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై హఠాత్తుగా యు టర్ను తీసుకోలేదని అన్నారు. ఎప్పుడూ సమస్య పరిష్కారం కావాలనుకుంటానే తప్ప రాజకీయాలు చేయనన్నారు. ఈ సందర్భంగా జనసేన న్యాయవిభాగానికి బి.ఆర్.అంబేద్కర్ లీగల్‌సెల్‌గా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం పేరు ఖరారు చేశారు.