Janasena: జగనన్న ఇళ్లు -పేదలందరికీ కన్నీళ్లు.. ప్రభుత్వంపై జనసేన సరికొత్త అస్త్రం
Janasena Digital Campaign: జనసేన పార్టీ మరో డిజిటల్ క్యాంపెయిన్‌కు రెడీ అవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో పెద్ద స్కాం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
Janasena Digital Campaign: వైసీపీ సర్కార్‌పై జనసేన పార్టీ మరో పోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న ఆ పార్టీ.. మరో డిజిటల్ సమరానికి రెడీ అయింది. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో స్కాం జరుగుతోందని.. దీనిని బయటపెట్టేందుకు సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న జగనన్న కాలనీలు అతి పెద్ద స్కాం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారని మండిపడ్డారు.
జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నాదెండ్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు.
పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం జగన్ రెడ్డి హామీ ఇచ్చారని.. తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారని నాదెండ్ల తెలిపారు. అయితే చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా.. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. భూ సేకరణలో జగనన్న కాలనీల
కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ.70 లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని అన్నారు. రూ.23,500 కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారని.. ఇందులో వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.
అలాగే మౌలిక సదుపాయాలు కోసం మరో రూ.34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించినా.. జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవన్నారరు నాదెండ్ల మనోహర్. గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని.. ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తోందన్నారు. 2022 జూన్ నాటికి 18,63,552 గృహాలు నిర్మిస్తామని చెప్పిన నాయకులు.. ఇప్పటివరకు కేవలం లక్షా 52 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని చెప్పారు. ఇంత దయనీయ పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పేదలను ఎందుకింత దగా చేశాని.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 12, 13 తేదీల్లో స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాలని జనసేన పార్టీ నాయకులకు ఆయన సూచించారు. 14న పథకం లబ్దిదారుల జాబితా, వారికి ఏ మేరకు నిధులు విడుదల చేశారు..? మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు లాంటి అంశాలపై సోషల్ ఆడిట్ చేస్తారని చెప్పారు. గతంలో రహదారుల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఏ విధంగా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేశామో.. అదే విధంగా #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్‌తో ఇళ్ల దుస్థితి, కాలనీల పరిస్థితి, గృహనిర్మాణ లబ్ధిదారుల బాధలను తెలియజేసే ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని జనసేన శ్రేణులకు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Also Read: T20 World Cup: భారత్ vs ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ నేడే.. పాక్‌తో ఫైనల్ ఆడేదెవరో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook