తిరుమలలో పవన్.. కీలక ప్రకటన చేసే అవకాశం!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 15 నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బస్సు యాత్ర చేపట్టనున్న సంగతి విదితమే. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ కల్యాణ్ తన బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ మూడు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం శనివారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా కాలినడక మార్గమైన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లారు. రాత్రి అలిపిరి నుంచి కాలినడకన ఆయన తిరుమల బయలుదేరారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు నడిచారు. దీంతో కోలాహలంగా కనిపించింది. అర్ధరాత్రి తిరుమల కొండపైకి చేరుకున్న పవన్ విలాసాలకు దూరంగా హంపి మఠంలో విడిది చేశారు. భక్తులకు ఇబ్బంది కాకుండా వీఐపీ దర్శనం కాకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి, చిత్తూరుల్లో పర్యటిస్తారు. ఇక్కడే పవన్ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యుల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా చిత్తూరు లేదా అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పవన్ బస్సు యాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు.