అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నివాసం ఏర్పాటు చేసుకోనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంతింటి నిర్మాణానికి ఉదయం 8-9 గంటల మధ్య భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకొని స్థానిక ప్రైవేట్ హోటల్‌లో బస చేశారు. అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్యనాయకులు మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో అమరావతిలోని ఇంటినే పార్టీ కార్యాలయంగా వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పవన్ కళ్యాణ్ భూమి పూజ అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న  మైదానంలో ఈనెల 14 వ తేదీన చేపట్టనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభను పురస్కరించుకొని 'మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు..' అంటూ రూపొందించిన వీడియోను జనసేన పార్టీ ఆదివారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది  మహనీయుల చిత్రాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇందులో గౌతు లచ్చన్న, శ్రీ శ్రీ, సర్ ఆర్థర్ కాటన్, అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, జాషువా, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణ రావు తదితర ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి.