సినీ క్రిటిక్ కత్తిమహేష్ ప్రస్తుతం విజయవాడలో వామపక్షాలతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడంతో పాటు ప్రత్యేక హోదాపై కేంద్రం మాట్లాడకపోవడాన్ని ఖండిస్తూ ఈ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ మాట్లాడుతూ పవన్ ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానంటే.. ఆయనతో కలిసి తాను పోరాటం చేయడానికి సిద్ధమేనని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రానికి ఏపీ ప్రజల పవర్ ఏంటో చూపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అసమర్థులు కావడం వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని.. ఇప్పటికైనా పాలకులు మేల్కోవాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించడం అభినందనీయమని ఆయన తెలిపారు.


ఏపీ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ భావిస్తుందని కత్తి మహేష్ తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పనిచేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తెప్పించాలని ఆయన అన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడిన కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ విషయంపై పోరాటం చేయడానికి ఐకాస (ఐక్య కార్యాచరణ సంఘం) అక్కర్లేదని.. ప్రజాసంఘాలతో కలిసిరావచ్చని ఆయన తెలిపారు.