దివంగత ఎమ్మెల్యే కిడారి కుమారుడు శ్రావణ్‌కు ఏపీ కేబినెట్లో స్థానం?
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబీకులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊరట కల్పించారు.
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబీకులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊరట కల్పించారని తెలుస్తోంది. కిడారి తనయుడు శ్రావణ్‌కు చంద్రబాబు అరుదైన అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారని... ఆ మేరకు శ్రావణ్‌కు సమాచారం అందించారని వినికిడి. కిడారి శ్రావణ్ ఆదివారం ఉదయం జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూడా పలు పత్రికలు వార్తలు రాశాయి. సెప్టెంబరు 23వ తేదీన అరకులో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
అప్పుడు చంద్రబాబు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిడారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా కిడారి కుమారుడు శ్రావణ్‌కు మంత్రి పదవి ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారని పలువురు సీనియర్ నేతలు అంటున్నారు. ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురికి కొత్తగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కిడారి మరో కుమారుడు సందీప్ కుమార్‌కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు. కిడారి మొదటి కుమారుడు శ్రావణ్ వారణాసి ఐఐటీలో (మెటలర్జీ) చేశారు. తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సందీప్ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని.. ఆయన గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని పార్టీ శ్రేణులు చెప్పడం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై శ్రావణ్ స్పందించినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని ఆయన తెలిపినట్లు సమాచారం.