కోడెల శివప్రసాద్ రావు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో డాక్టర్లు ఏం చెప్పారు ?
కోడెల శివప్రసాద్ రావు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక
హైదరాబాద్: కోడెల శివ ప్రసాద రావు పార్థివదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసింది. ఉస్మానియా ఆసుపత్రికే చెందిన నలుగురు వైద్యులు ఈ పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో భవిష్యత్‌లో కేసు విచారణ అవసరాల నిమిత్తం ఆయన పార్థివదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నంతసేపు వీడియో చిత్రీకరించారు. డా కోడెల శివప్రసాద రావు మెడపై ఉన్న గుర్తులు, ఆనవాళ్ల ప్రకారం ఆయన ఉరేసుకునే ఆత్మహత్యకు పాల్పడినట్టు వైద్యులు ఒక ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మెడపై ఉరేసుకున్న గాయాలు తప్ప శరీరంపై మరెక్కడా ఎటువంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం డా కోడెల శివప్రసాద్ రావు పార్థివదేహాన్ని ఆయన అల్లుడు మనోహర్‌కి అప్పగించారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కోడెల శివప్రసాద రావు పార్థివదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుంచి నేరుగా ఎల్వి ప్రసాద్ చౌరస్తాలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి తరలించారు.